Gold Purchase Tips: దీపావళి పండుగ హంగామా మొదలైంది. ఈ పండుగకి బాణాసంచా కాల్చడం కోసం ఎంతో ఉత్సాహం చూపిస్తారు. అదొక్కటే కాదు.. బంగారం (Gold) కొనాలని కూడా అంతగా ఉత్సహపడుతుంటారు. పండక్కి బంగారం నగలు కొనడం ఒక శుభసూచకంగా భావిస్తారు భారతీయులు. అంతేకాదు ఇది సురక్షితమైన పెట్టుబడిగా కూడా పనికి వస్తుందని భావిస్తారు. అలాంటప్పుడు మీరు దీపావళికి బంగారం కొనుగోలుచేయబోతున్నట్లయితే, గుర్తుంచుకోవలసిన విషయాలను అర్థం చేసుకోండి. ఎందుకంటే, ఒక్క చిన్న పొరపాటు మీకు చాలా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.
- హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి:
ఎప్పుడూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌తో ధృవీకరించిన బంగారాన్ని మాత్రమే కొనండి. ఆధార్ కార్డుపై 12 అంకెల కోడ్ ఉన్నట్లే, బంగారంపై కూడా 6 అంకెల హాల్‌మార్క్ కోడ్ (HallMark) ఉంటుంది. దీనిని హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే HUID అంటారు. ఈ నెంబర్ ఆల్ఫాన్యూమరిక్ కావచ్చు, అంటే ఇలా ఉండొచ్చు.. – AZ4524. హాల్‌మార్కింగ్ ద్వారా బంగారం ఎన్ని క్యారెట్ల ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. - ధరను క్రాస్ చెక్ చేయండి:
ఇండియా బులియన్ – జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ నుంచి బంగారం కొనేముందు దాని ధర ఎంత ఉందొ చెక్ చేయండి. బంగారం ధర 24 క్యారెట్లు, 22 క్యారెట్లు – 18 క్యారెట్లను బట్టి మారుతుంది.
24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. అయితే ఇది చాలా మృదువైనది కాబట్టి దానితో ఆభరణాలు తయారు చేయడం కుదరదు. సాధారణంగా 22 క్యారెట్ లేదా అంతకంటే తక్కువ బంగారాన్ని ఆభరణాల కోసం ఉపయోగిస్తారు.
క్యారెట్ ప్రకారం ధరను ఇలా చెక్ చేయండి: 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.60 వేలు అనుకుందాం. అంటే ఒక గ్రాము బంగారం ధర రూ.6000. అటువంటి పరిస్థితిలో, 1 క్యారెట్ స్వచ్ఛత కలిగిన 1 గ్రాము బంగారం ధర 6000/24 అంటే 250 రూపాయలు.
Also Read: ధన్తేరస్ రోజు దేశంలో ఎంత పసిడి కొనుగోలు చేశారో తెలుస్తే షాక్ అవుతారు..!!
ఇప్పుడు మీ ఆభరణాలు 18 క్యారెట్ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారనుకుందాం, అప్పుడు దాని ధర 18×250 అంటే గ్రాముకు రూ. 4,500. ఇప్పుడు మీ ఆభరణాల గ్రాముల సంఖ్యను రూ.4,500తో గుణించడం ద్వారా బంగారం ఖచ్చితమైన ధరను లెక్కించవచ్చు. అంటే, మీరు 25 గ్రాముల బరువైన 18 క్యారెట్ల బంగారు నగ తీసుకుంటే కనుక దాని ధర 25 గ్రాములు X రూ. 4500 = 1,12,500 రూపాయలు అవుతుంది. (దీనికి అదనంగా మేకింగ్ చార్జెస్.. టాక్స్ లు వంటివి ఉండవచ్చు. అవి ప్రాంతాన్ని బట్టి.. దుకాణాన్ని బట్టి మారవచ్చు)
- క్యాష్ పేమెంట్ చేయవద్దు.. బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు..
బంగారం కొనేటప్పుడు క్యాష్ పేమెంట్ కాకుండా UPI – డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయడం మంచిది. మీకు కావాలంటే, మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. ఆ తర్వాత బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే, ఖచ్చితంగా ప్యాకేజింగ్‌ను చెక్ చేయండి.
- రీసెల్లింగ్ పాలసీని తెలుసుకోండి:
చాలా మంది బంగారాన్ని పెట్టుబడిగా చూస్తారు. అటువంటి పరిస్థితిలో, బంగారం పునఃవిక్రయం విలువ గురించి మీకు పూర్తి సమాచారం ఉండటం ముఖ్యం. అలాగే, సంబంధిత జ్యువెలర్ బైబ్యాక్ పాలసీ గురించి స్టోర్ ఉద్యోగుల నుంచి ముందుగా వివరాలు తెలుసుకోండి.
మేకింగ్ ఛార్జీలు 30% వరకు ఉండవచ్చు:
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, మేకింగ్ ఛార్జీలను గుర్తుంచుకోండి. మెషిన్ మేడ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీ 3-25% వరకూ ఉండవచ్చు. స్వచ్ఛమైన బంగారు నాణేలు అతి తక్కువ మేకింగ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. కొంతమంది కళాకారులు క్లిష్టమైన డిజైన్ చేసిన ఆభరణాలను కూడా తయారు చేస్తారు. వారి ప్రోడక్ట్స్ పై మేకింగ్ ఛార్జీ 30% వరకు ఉండే అవకాశం ఉంటుంది.
బంగారం కొన్నపుడు దానిపై 3% GST చెల్లించాలి . అలాగే, బంగారం అమ్మాలని అనుకుంటే, దానిని అమ్మినపుడు వచ్చే లాభంపై టాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు బంగారాన్ని కొని 3 సంవత్సరాలలోపు విక్రయించినట్లయితే, దానిని స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈ అమ్మకం ద్వారా వచ్చే లాభం మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం టాక్స్ పరిధిలోకి వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత బంగారాన్ని విక్రయిస్తే దానిని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. అప్పుడు దీనిపై 20.8% పన్ను చెల్లించాలి.
Watch this interesting Video: