Bansi Narayan Temple: మనదేశం దేవాలయాలకు.. ఆధ్యాత్మిక సంపదకు ప్రసిద్ధి చెందింది. ఎన్నో అద్భుతాలు మన దేశంలో కనిపిస్తాయి. ఆలయాలు.. వాటి వెనుక ఉండే కథలు ఎప్పుడూ మనల్ని ఉత్తేజితులను చేస్తాయి. దేవాలయాలకు సంబంధించి రకరకాల సంప్రదాయాలు.. విశిష్టతలు మనల్ని ఒక్కోసారి ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. చిన్నా.. పెద్దా అని తేడా లేదు.. ప్రతి దేవాలయం దేనికి దానికి ఒక ప్రత్యేకతతో శోభిల్లుతోంది. కొన్ని దేవాలయాల్లో జరిపే పూజా విధానాలు మనల్ని ఆకర్షిస్తే.. మరికొన్ని ఆలయాల్లో పాటించే ఆచారాలు మనల్ని సంతోషంతో ముంచెత్తుతాయి. ఆధ్యాత్మికతను పెంపొందించే వాతావరణం.. ఎప్పటికప్పుడు నిర్వహించే పూజలు.. మన ఆలయాలకు ఒక ప్రత్యేకతను తీసుకువస్తాయి. నిత్య పూజలతో శోభిల్లే ఆలయాలు కొన్నైతే.. ఒక్కో ఆలయంలో నెలకొకసారి మాత్రమే పూజలు జరుగుతాయి. కేరళలోని స్వామి అయ్యప్ప దేవాలయం ఏడాదిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే దర్శనానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఉత్తర భారతావనిలో చార్ ధామ్ యాత్రలో దేవాలయాలు ఏడాదికి ఒకసారి కొన్నిరోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. కానీ, మన దేశంలో ఒక దేవాలయంలో మాత్రం ఏడాదికి ఒక్కసారే అదీ ఒకే ఒక్కరోజు కొన్ని గంటల పాటు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విశిష్ట దేవాలయం ఉత్తరాఖండ్‌లో ఉంది.
Bansi Narayan Temple: ఉత్తరాఖండ్‌లోని బన్సీ నారాయణ్ ఆలయం హిమాలయాల ఒడిలో ఉన్న దేవాలయం. దాని విశేషాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రక్షాబంధన్ రోజున తెరుస్తారు. ఈ కారణంగా ఇది రహస్యమైన- పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున ఇక్కడికి వచ్చి పూజించడం విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ రోజున విష్ణువు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఇక్కడ చేసే పూజలు, దర్శనం ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని నమ్ముతారు. రక్షాబంధన్ రోజున ఇక్కడ దర్శనం కోసం భక్తులు పెద్ద క్యూలలో నిల్చుని స్వామి దర్శనం చేసుకుంటారు.
ఇదిలా ఉంటే… ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 19వ తేదీ సోమవారం తెల్లవారుజామున 03:04 గంటలకు ప్రారంభమవుతుంది. 11:55 p.m.కి ముగుస్తుంది. ఈ సమయంలోనే ఈ ఆలయంలో దర్శనానికి అవకాశం ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున రక్షా బంధన్ పండుగను జరుపుకుంటారు.
Bansi Narayan Temple: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని ఉర్గామ్ లోయలో ఉన్న బన్సి నారాయణ ఆలయం శ్రీమన్నారాయణుడిఆలయం. అయితే ఈ ఆలయంలో శివుడు, నారాయణ (శ్రీ కృష్ణుడు) విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని బన్సి నారాయణ (శివుడు)- బన్సి నారాయణ (శ్రీ కృష్ణ) దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం లోపలి వైపు కేవలం 10 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఇక్కడి పూజారులు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ నాడు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. భక్తులు ప్రసాదం చేసే ఆలయానికి సమీపంలో ఎలుగుబంటి గుహ కూడా ఉంది. రక్షాబంధన్ రోజున ఈ ఊరిలో ప్రతి ఇంటి నుండి వెన్న తెచ్చి ప్రసాదంలో చేర్చి దేవుడికి నైవేద్యంగా పెడతారు.
ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు మనల్ని కదలనీయవు. మానవ నివాసాలకు దూరంగా.. పర్వతాల అందమైన దృశ్యాల మధ్య దేవాలయం మానసికోల్లాసాన్నిస్తుంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దట్టమైన ఓక్ అడవుల మధ్య నుంచి వెళ్లాలి. ఈ ఆలయం 6వ, 8వ శతాబ్దాల మధ్య నిర్మించిందని భావిస్తున్నారు.
Bansi Narayan Temple:ఈ ఆలయంలో ఒక ఆసక్తికరమైన నమ్మకం ఏమిటంటే, బన్సీ నారాయణ్ ఆలయంలో రక్షాబంధన్ రోజున తమ సోదరులకు రాఖీ కట్టిన సోదరీమణులకు జీవితం అంతా సంతోషం దక్కుతుందని భావిస్తారు. అలాగే వారి సోదరులు కష్టాల నుంచి విముక్తి పొందుతారని.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆందోళనలు/బాధలు తొలగిపోతాయని భావిస్తారు. అందుకే రక్షాబంధన్ రోజున ఇక్కడికి పెద్ద సంఖ్యలో దర్శనం కోసం భక్తులు దూరతీరాల నుంచి వస్తుంటారు. ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజ అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత.. మళ్ళీ వచ్చే రక్షాబంధన్ వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు.
ఆలయానికి సంబంధించి కథ ఇదీ..
Bansi Narayan Temple: బన్సీ నారాయణ్ ఆలయానికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. ఈ కథ ప్రకారం, విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తరువాత ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. నారద మహర్షి ఈ ప్రదేశంలో నారాయణుడిని ఆరాధించాడని నమ్ముతారు. నారదుడు సంవత్సరంలో 364 రోజులు ఇక్కడ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాడు. ఒక్క శ్రావణ పూర్ణిమ రోజున మాత్రమే నారదుడు పూజలు నిర్వహించడు. దీనికి సరైన కారణం తెలియనప్పటికీ, సాధారణ భక్తులు పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించడం కోసమే నారదుడు ఒక్కరోజు స్వామి సేవకు దూరంగా ఉంటాడనీ, అందుకే ఆ ఒక్కరోజు భక్తులు ఇక్కడ నారాయణుని పూజించవచ్చని కథనం ప్రచారంలో ఉంది. ఈ కారణంగా, ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే రక్షాబంధన్ రోజున తెరుచుకుంటాయి.
రక్షాబంధన్ రోజున మాత్రమే ఎందుకు..
రక్షాబంధన్ రోజున ఈ ఆలయాన్ని తెరవడం అనేది.. బలి చక్రవర్తి – విష్ణువుతో ముడిపడి ఉన్న కథ. ఈ కథ ప్రకారం, వామన రూపంలో తనను పాతాళానికి తోక్కేసిన విష్ణుమూరిని బలి చక్రవర్తి తన ద్వారపాలకుడిగా ఉండమని అభ్యర్థించాడు. దానిని భగవంతుడు అంగీకరించాడు. అప్పుడు బలి రాజుతో కలిసి పాతాళానికి వెళ్ళాడు విష్ణు మూర్తి. లక్ష్మీదేవి చాలా రోజులుగా విష్ణువు ఎక్కడా కనిపించకపోవడంతో, నారదుని సూచన మేరకు, శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షా సూత్రాన్ని అంటే రాఖీ కట్టి విష్ణువును విడిపించమని బలి చక్రవర్తిని అభ్యర్థించింది. దీని తరువాత, బలి చక్రవర్తి ఈ ప్రదేశంలోనే విష్ణువును లక్ష్మీ దేవితో తిరిగి కలిపాడని పురాణ గాథ.
తరువాత పాండవులు ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. రక్షాబంధన్ రోజున ఇక్కడికి వచ్చే మహిళలు బన్సీ నారాయణుడికి రాఖీ కడతారు. ఈ ఆలయం చుట్టూ అరుదైన జాతుల పుష్పాలు, చెట్లను కూడా చూడవచ్చు. ఇక్కడి దృశ్యం మంత్రముగ్దులను చేస్తుంది.
Also Read : RTV చెప్పిందే.. సీఎం రేవంత్ చెప్పారు