శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పేరు ఈ మధ్య వార్తల్లో నిత్యం వినిపిస్తుంది. ఆమె వివాదాస్పద వ్యవహారశైలిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె అరాచకానికి మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్థానికంగా ఉండే ఓ హోటల్ ముందు నిలబడి నిర్వాహకులను తొడగట్టి మరీ బెదిరిస్తున్నారు. వెటకారంగా నవ్వుకుంటూ ఫోన్‌లో వీడియో తీస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు. దీంతో ఆమె వ్యవహారశైలిపై స్థానికులు మండిపడుతున్నారు.
సీఐపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం?
శ్రీకాళహస్తిలో ఇటీవల నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త సాయి చెంపదెబ్బలపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకోవడం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనను జనసేన పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమె తీరును తీవ్రంగా ఖండించారు. తానే శ్రీకాళహస్తి వస్తా.. నేరుగా తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. సోమవారం తిరుపతి వెళ్లి ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదుచేయనున్నారు. ఈలోపే ప్రభుత్వం అంజూ యాదవ్‌పై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆమెకు ఛార్జీ మోమో ఇచ్చారు. అలాగే సమగ్ర నివేదికను అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డికి అందజేశారు.
తొలి నుంచి ఆమె తీరు వివాదాస్పదం..
మరోవైపు జనసేన కార్యకర్తపై అంజూ యాదవ్ చేయి చేసుకున్న ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటోగా స్వీకరించిన కమిషన్ సీఐతో పాటు ఎస్పీ, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27లోపు ఆమెపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఇటు పవన్ కల్యాణ్ తిరుపతి రానుండడం.. అటు మానవ హక్కుల కమిషన్ స్పందించడంతో సీఐపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న టీడీపీ కార్యకర్తలపైనా చేయి చేసుకున్నారు. అనంతరం ఓ హోటల్ నడుపుకుంటున్న మహిళను సైతం బట్టలు ఊడిపోతున్నా సరే బలవంతంగా స్టేషన్ తీసుకెళ్లి కొట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. అలాగే ఓ వైసీపీ ఎమ్మెల్యే కూతురుతోనూ సీఐ దురుసుగా ప్రవర్తించండంపై పార్టీలకతీతంగా ప్రజందరూ ఆమె వ్యవహారశైలిపై మండిపడుతున్నారు.