తక్కువ ధరకే రుచికరమైన ఆహారం..
సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రైళ్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే వీరికి రుచిగల ఆహారం అందదు. ప్లాట్‌ఫాంపై దొరికే ఆహార పదార్ధాలు నాసిరకంగా ఉండటంతో పాటు ధర ఎక్కువగా ఉంటాయి. దీంతో కొంతమంది వాటిని అయిష్టంగానే కొని ఆకలి నింపుకుంటే.. మరికొంతమంది అలాగే పస్తులతోనే జర్నీ చేస్తుంటారు. వీరి బాధలు అర్థంచేసుకున్న భారతీయ రైల్వేశాఖ(Indian Railways) తక్కువ ధరకే రుచికరమైన ఆహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశంలోని కొన్ని రైల్వేస్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆహారం అందిస్తోంది.
రూ.20కే అల్పాహారం, రూ.50కే భోజనం..
తాజాగా దక్షిణ మధ్య రైల్వే(Sounth Central Railway) కూడా ఈ ఫుడ్ కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్(Secunderabad), విజయవాడ(Vijayawada), రేణిగుంట(Renigunta), గుంతకల్(Guntakal) రైల్వేస్టేషన్లలో జనరల్ బోగీలు ఆగే చోట వీటిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఐఆర్‌సీటీ(IRCTC) వంటశాలలు అందుబాటులో ఉండటంతో ఈ నాలుగు స్టేషన్లను తొలి విడతగా ఎంపిక చేసుకుంది. ఐఆర్‌సీటీసీ జన్ అహార్ ద్వారా భోజనం సరఫరా చేస్తోంది. ఈ కౌంటర్లలో కేవలం రూ.20కే అల్పాహారం, రూ.50కే భోజనం అందిస్తోంది. దీంతో సామాన్యులకు ఈ స్టాళ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఎకానమీ ప్యాకెట్.. కాంబో ప్యాకెట్..
ఇక ఈ ఫుడ్ కౌంటర్లలో ఆహారాన్ని రెండు రకాలుగా అందిస్తున్నారు. రూ.20లకే లభించే ఎకానమీ ప్యాకెట్‌లో 7 పూరీలు, 150 గ్రాముల వెజిటేబుల్ కర్రీ, ఊరగాయ పచ్చడి ఉన్నాయి. అలాగే రూ.50లకు దొరికే కాంబో ప్యాకెట్‌లో కిచిడీ, రాజ్మా రైస్, అన్నం, పావ్ భాజీ, చోలే ఖాతురే, చోలే కుల్చే లాంటివి అందిస్తున్నారు. తక్కువ ధరకే రుచికరమైన ఆహారం అందించడంతో జనరల్ కోచ్ ప్రయాణికులు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే అన్ని స్టేషన్లలో ఈ ఫుడ్ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.