Telangana Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హస్తం హవా నడుస్తోంది. బొగ్గు గని కార్మికులు అధికార కాంగ్రెస్‌కు జైకొట్టినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం సింగరేణిలో తొలి విజయం ఐఎన్‌టీయూసీ ఖాతాలో పడింది. ఇల్లెందులో 46 ఓట్ల తేడాతో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. అలాగే కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఐఎన్‌టీయూసీ ముందంజలో ఉంది. గురువారం ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 96.3 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం నాడు మొత్తం 11 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. హైకోర్టు జోక్యంతో ఈ రోజు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. దాదాపు నలభై వేల మంది... 84 పోలింగ్ కేంద్రాలలో, 168 బ్యాలెట్ బాక్సులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ మధ్య నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ భారీగా పోలింగ్ నమోదయింది.
తాయిలాలు, హామీలు ప్రకటించిన పార్టీలు..
ఎన్నికలకు ముందు బొగ్గుబావులు, కార్యాలయాల వద్ద ప్రచార పర్వాన్ని కొనసాగించిన ప్రధాన సంఘాలు చివరి అంకంగా తాయిలాలు పంపకాలు కూడా జరిపాయి. అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. బీఆర్‌ఎస్ అనుబంధ యూనియన్ టిబిజికెఎస్ తొలుత ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించినప్పటికీ తరువాత ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాము కూడా బరిలో ఉన్నామని ప్రకటించడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అనుబంధ యూనియన్ ఐఎన్‌టీయూసీ, సీపీఐ ఏఐటీయూసీ, బీజేపీ అనుబంధ బీఎంఎస్ మధ్య ప్రధానంగా పోటీ జరిగింది.
Also Read:
వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..!
ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..