Hyderabad : హైదరాబాద్ నగర పరిధి కాటేదాన్‌లో ఓ పైవేటు పాఠశాలలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం పిల్లలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వెనక్కి వెళ్లి బస్సు బోల్తా పడిందని, డ్రైవర్ హ్యాండ్‌బ్రేక్ సరిగా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.
కాగా బస్సు బోల్తాపడిన సమయంలో బస్‌లో దాదాపు 30 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు బోల్తా పడటంతో అక్కడి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లల్ని బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇక ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.