Rajasthan: రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం వెలుగు చూసింది. తన భార్య వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసిన భర్త, అత్తమామలు.. దారుణ చర్యకు పూనుకున్నారు. ఆమె గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా.. భార్యను వివస్త్రను చేసి ఊరంతా ఊరేగించాడు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన గిరిజన మహిళకు వివాహం జరిగింది. ఆమె భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి వచ్చి ఉంటుంది. అయితే, ఈమె మరొకరితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం ఆమె భర్తకు, అతని కుటుంబ సభ్యులందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చారు భర్త, అత్తమామలు. ఇంతలో ఆమె తన ప్రియుడితో ఏకాంతంగా కనిపించింది. దాంతో ఆగ్రహానికి గురైన భర్త, అత్తమామలు, ఆమెను బైక్‌పై బలవంతంగా తమ గ్రామానికి తీసుకెళ్లారు. ఊరి మధ్యలోకి తీసుకెళ్లాక.. ఆమెను వివస్త్రను చేశారు. అనంతరం ఊరంతా నగ్నంగా ఊరేగించారు.
ఈ ఘోరాన్ని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పైగా తమ తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేసుకున్నారు. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సెన్సేషన్‌గా మారింది. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ నాయకులు ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మ్యాటర్ మరింత వివాదాస్పదం అవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సంఘటన చోటు చేసుకున్న గ్రామానికి వెళ్లి.. బాధితురాలిని కాపాడారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక పోలీసుల ఎంట్రీతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కొందరు గాయపడి దొరికిపోగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఆమెపై దాడికి పాల్పడిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా ప్రకటించారు. వీరిలో ప్రధాన నిందితులు సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బలవంతంగా మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లి నగ్నంగా ఊరేగించినందుకు బాధితురాలు తన భర్త కన్హా గమేటితో పాటు సూరజ్, బెనియా, నెతియా, నాథు, మహేంద్రలపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దాంతో ప్రధాన నిందితులైన కన్హా, నెతియా, బెనియా, పింటూ లను, నేరాన్ని ప్రోత్సహించినందుకు పునియా, ఖెతియా, మోతీలాల్‌తో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే, కన్హా, నెతియా, బెనియా పారిపోయే ప్రయత్నంలో గాయపడి ప్రతాప్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు డీజీపీ. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపడంతో.. సదరు గ్రామంలో శాంతిభద్రతల సమస్య రాకుండా ఉండేందుకు భారీగా బలగాలను మోహరించారు.
ఇదిలాఉంటే.. ప్రాథమిక విచారణలో మహిళకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలిందని ధరియావాడ్ ఎస్‌హెచ్‌ఓ పెషావర్ ఖాన్ తెలిపారు. మహిళను అత్తమామలు కిడ్నాప్ చేసి తమ గ్రామానికి తీసుకెళ్లారని, అక్కడ ఆమెను నగ్నంగా ఊరేగించారని పోలీసులు తెలిపారు. ఆమె వేరే వ్యక్తితో ఉండటాన్ని చూసి భర్త, అత్తమామలు ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టారని వివరించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని ప్రతాప్‌గఢ్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ తెలిపారు.
రాజకీయంగా పెను దురమారం..
ఇదిలాఉంటే.. మహిళను నగ్నంగా ఊరేగించిన అంశం రాజస్థాన్‌లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. 'నాగరిక సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు స్థానం లేదు' అంటూ ట్వీట్ చేసిన ఆయన.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారందరికీ శిక్షపడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ప్రియాంక గాంధీ స్పందన..
రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. బాధితురాలికి వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని, ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకాంక్షించారు.
Also Read: