భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నదులైన రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, స్వాన్ తోపాటు ఇతర నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు, పంట పొలాలు, భారీ వాహనాలన్నీ కూడా వరదల కొట్టుకుపోయాయి. కార్లు, బస్సులు, ఇళ్లు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు 4గురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల రహదారులన్నీ మూసుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లితోంది. వరదల ధాటికి రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు విడిచారు.
భారీ విధ్వంసం, చాలా చోట్ల రెడ్ అలర్ట్:
వర్షాలు, వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. జూన్ 24 నుంచి ఇప్పటి వరకు హిమాచల్‌లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. సోలన్, సిమ్లా, సిర్మౌర్, కులు, మండి, కిన్నౌర్, లాహౌల్‌లో రానున్న 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త సందీప్ కుమార్ శర్మ తెలిపారు. దీంతో పాటు ఉనా, హమీర్‌పూర్, కాంగ్రా, చంబాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాబోయే 24 గంటలపాటు మండి, కిన్నౌర్, లాహౌల్-స్పితీకి వరద హెచ్చరిక జారీ చేశారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి :
హిమాచల్ ప్రదేశ్‌లో వరదల పరిస్థితిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, 'ఈ ప్రకృతి విపత్తులో హిమాచల్ ప్రదేశ్‌లో చాలా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, నీటి వనరుల నుండి సరైన దూరం పాటించాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభుత్వం, 12 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, ప్రభుత్వం సహాయం చేయడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా అత్యవసరం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 9317221289, 8580616570 డయల్ చేయాలని వెల్లడించారు.
50ఏళ్లలో ఏనాడూ చూడని వర్షాలు:
గత 50ఏండ్ల కాలంలో ఏనాడూ చూడని రీతిలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు అన్నారు. కుండపోత వర్షం కారణంగా ఇప్పటివరకు రూ. 30వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 17మంది మరణించినట్లు తెలిపారు. 'రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వచ్చే 24 గంటల పాటు హిమాచల్ ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి 3 హెల్ప్‌లైన్ నంబర్‌లను (1100, 1070, 1077) జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, ఈ నంబర్‌లకు కాల్ చేయమని తెలిపారు.