SureshBabu: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. సున్నితమైన అంశాలపై తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో పాటు మతపరమైన అంశాలకు ఇండస్ట్రీ ఎప్పుడూ దూరంగానే ఉంటుందన్నారు. విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణ గొడవలప్పుడూ కూడా చిత్ర పరిశ్రమ స్పందించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మా నాన్న రామానాయుడు, తాను కూడా టీడీపీ తరపున పనిచేశామన్నారు. అది తమ వ్యక్తిగతమైన అంశమని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబే కాదు చాలామంది సీఎంలు కృషి చేశారని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి కొద్ది మంది మాత్రమే స్పందించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వనీదత్, కేఎస్ రామారావు, నట్టికుమార్, తమిళ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్‌లు స్పందించారు. ఇక రజనీకాంత్ అయితే టీడీపీ యువనేత నారా లోకేష్‌కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీ ధీమా వ్యక్తంచేశారు.
చంద్రబాబు పోరాటయోధుడు అని ఆయనను అక్రమ కేసులు ఏమీ చేయలేవని రాఘవేంద్రరావు తెలిపారు. ‘శ్రీ వెంకటేశ్వరస్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండా బయటకు వస్తారు’ అని ట్వీట్ చేశారు.
సినీ నిర్మాత అశ్వినీదత్ కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అరెస్టు చేసిన వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశానికి గొప్ప ప్రధాని, స్పీకర్‌తో పాటు గొప్ప రాష్ట్రపతిని అందించిన ఘనత చంద్రబాబుదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోయిన దుర్మార్గకరంగా అరెస్టు చేసి లేనిపోని విమర్శలు చేస్తున్నారని, వారెవరికి పుట్టగతులు ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మరో ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు అయితే ఏకంగా ప్రధాని మోదీని విమర్శిస్తూ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. మోదీకి తెలియకుండానే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారా? అని లేఖలో ప్రశ్నించారు. ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఇక అందరికంటే ముందుగా నిర్మాత నట్టికుమార్ చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదన్నారు.14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని.. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరమని నట్టి వాపోయారు.