Nikki Haley Drops Out Of Presidential Race: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republican Party) అభ్యర్థిగా రేసులో ఉన్న భారత సంతతికి చెందిన మాజీ గవర్నర్ నిక్కీ హేలీ ఇప్పుడు అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నారు. బుధవారం నుంచి నిక్కీ తన ప్రచారాన్ని నిలిపివేశారు. 15 రాష్ట్రాల పార్టీ ప్రైమరీస్ లో ఓటమి పాలవ్వడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
హేలీ ఈ నిర్ణయం తీసుకోవడంతో రిపబ్లికన్ పార్టీ నుండి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న ఏకైక ప్రధాన అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మిగిలారు. ఈ విధంగా 2024 నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) మరోసారి ట్రంప్‌తో తలపడనున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగడం ఇది వరుసగా మూడోసారి.
ట్రంప్ (77) తన ఏకైక రిపబ్లికన్ ప్రత్యర్థి హేలీ (52)పై బలమైన ఆధిక్యాన్ని సాధించారు. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ హేలీ బుధవారం మాట్లాడుతూ, "నా ప్రచారాన్ని ఆపడానికి ఇది సమయం." అని అన్నారు. నేను అమెరికన్ల గొంతులను వినాలనుకుంటున్నాను. పోటీ నుంచి తప్పుకోవడం గురించి నాకేమి విచారం లేదు. నేను అభ్యర్థిగా మాత్రమే లేను..కానీ నా గొంతును వినిపించడానికి ఎప్పుడూ ముందే ఉంటాను అని తెలియజేశారు.
హేలీ ఇప్పుడు ట్రంప్‌కు మద్దతిస్తారా?
నిక్కీ ఇప్పుడు ట్రంప్‌కు మద్దతిస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. హేలీకి సన్నిహితులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం వల్ల తమకు మంచి జరుగుతుందని కొందరు నమ్ముతుంటే మరికొందరు ఆయనకు మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తన ప్రచార సమయంలో, రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ గెలిచిన మొదటి మహిళగా హేలీ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ లేదా రిపబ్లికన్ ప్రైమరీలో గెలుపొందిన మొదటి భారతీయ అమెరికన్ కూడా ఆమె. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలా హారిస్, 2024లో వివేక్ రామస్వామి వంటి మరో ముగ్గురు భారతీయ సంతతి అధ్యక్ష అభ్యర్థులు ఒక్క ప్రైమరీలో కూడా విజయం సాధించలేకపోయారు.
Also read: విజయంతో అదరగొట్టిన సింధు-శ్రీకాంత్.. ఫస్ట్ రౌండ్ కే ప్రణయ్ ఔట్!