మహారాష్ట్రంలో మహాయుతి కూటమి గెలుపు దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే ఈ కూటమి 218 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక మహా వికాస్ అఘాడి కూటమి 57 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. దీంతో మహారాష్ట్రలో మహాయుతి నుంచి తర్వాతి సీఎం ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. శివసేన నుంచి వచ్చిన ఏక్‌నాథ్ షిండే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పోటీ నడుస్తోంది. ఫడ్నవీస్ సీఎం బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉందని బీజేపీ ప్రతినిధి ప్రవీణ్ దరేకర్ అన్నారు.
మరోవైపు శివసేన ప్రతినిధి షీతల్ మితారే మాట్లాడుతూ మహాయుతి నాయకులు ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని తెలిపారు. ఏక్‌నాథ్ షిండేనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ హైకమాండ్ ఇంతవరకు సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీసా ? లేదా ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతారా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.