Yoges Varma: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై బహిరంగంగా దాడి చేయడం కలకలం రేపింది. పదుల సంఖ్యలో పోలీసుల సమక్షంలోనే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ ఎమ్మెల్యేపై చెప్పుతో కొట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మేరకు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల విషయంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్, సదరు ఎమ్మెల్యే యోగేష్ వర్మ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన అవధేష్ సింగ్ పోలీసుల ఎదుటే ఎమ్మెల్యే యోగేష్ వర్మపై దాడికి పాల్పడ్డాడు. అడ్వకేట్స్ అంతా ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. దీంతో ఎమ్మెల్యే, ఆయన సహచరులు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను విడదీశారు.
అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఎన్నికల నేపథ్యంలో..
ఈ ఘటన అనంతరం ఎమ్మెల్యే యోగేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌కు ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు వేసేందుకు బీజేపీ కార్యకర్తలు వచ్చారు. ఈ సమయంలోనే బార్ అసోషియేషన్ వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. మొదట ట్రేడ్ యూనియన్ నాయకుడు రాజు అగర్వాల్‌ను కొట్టి కరపత్రాన్ని చించివేశారు. నేను అతనిని పరామర్శించేదుకు వస్తే న్యాయవాది అవధేష్ సింగ్ నాపై దాడి చేశాడు' అని చెప్పారు.