Devendra Fadnavis: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనేదానిపై దేవేంద్ర ఫడణవీస్ తొలిసారి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఉన్నారనేదానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అన్నారు. తప్పుడు కథనాలు, మతం ఆధారంగా ఓటర్లను ఆకట్టుకోవడం వంటి ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ఓటర్ల మద్దతు, పార్టీ శ్రేణుల సాయంతో ప్రతిపక్షాల చక్రవ్యూహాన్ని ఛేదించడంలో సఫలమయ్యాననని చెప్పారు. కాగా సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలని మహారాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చకు తెర దింపారు. బీజేపీ, షిండే వర్గం మధ్య విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సీఎం పదవిపై వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరనేది మహాయుతి పార్టీల నేతలు నిర్ణయిస్తారని తెలిపారు.
కలిసి నిర్ణయం..
మహా సీఎం పై కూటమి నేతలు అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కూటమి నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఇది కేవలం ఒక పార్టీ విజయం కాదని.. ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు కలిసి కష్టపడి పని చేసిన దానికి లభించిన ఫలితమని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను మోడ్రన్ అభిమన్యుడనని, ‘చక్రవ్యూహాన్ని’ ఎలా ఛేదించాలో నాకు తెలుసునని... ఈ విజయంలో నా సహకారం చాలా తక్కువేనని, ఇది మా జట్టు విజయం అని భావిస్తున్నా’ అని ఫడ్నవీస్ అన్నారు.