భారత స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకూ మంది ప్రధానులుగా బాధ్యతలు స్వీకరించారు. అందులో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే మూడు దఫాలు అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన తర్వాత ఎక్కువకాలం పనిచేసిన ప్రధానిగా ఇందిరాగాంధీ నిలిచారు. మోదీ ప్రకటించినట్టు మూడో దఫా విజయసాధిస్తే ఆ రికార్డు ఆయన సొంత మవుతుంది.
నెహ్రూ హయాంలో ఏం జరిగింది ?
1951-52 లో దేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లోక్ సభ స్థానాల్లో నాలుగింట మూడు వంతుల సీట్లను గెలుచుకున్నారు. 494 సీట్లకు గాను 364 స్థానాలను ఆయన ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, ఆ తరువాత 1957 ఎన్నికల్లోనూ, 1962 ఎన్నికలలోనూ పూర్తి మెజారిటీ సాధించారు. ఆ నాడు పార్టీలో, ప్రభుత్వంలో కొంతమంది నేతల నుంచి కొన్ని చిక్కులు ఎదుర్కొన్నా.. దేశానికి సుదీర్ఘకాలం పని చేసిన ప్రధానిగా పాపులర్ అయ్యారు. మూడు సార్లు ప్రధాని అయిన ఘనకీర్తిని సొంతం చేసుకున్నారు. దేశంలో అతికొద్ది కాలం పాటు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని పదవిలో కొనసాగారు. నెహ్రూ అస్తమయం అనంతరం 1964 లో ఆయన ప్రధాని అయ్యారు. కానీ కేవలం 19 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. అప్పటి సోనియట్ యూనియన్ లోని తాష్కెంట్ లో ఆయన హఠాత్తుగా కన్ను మూశారు.
ఇందిరా గాంధీ హవా
దేశానికి ఏకైక మహిళా ప్రధాని అయిన ఇందిరాగాంధీ 1966 నుంచి 1977 వరకు, మళ్ళీ 1980 నుంచి 1984 వరకు అధికారంలో కొనసాగారు. పంజాబ్ లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన కారణంగా 1984 అక్టోబరు 31 న ఇద్దరు సిక్కు గార్డుల చేతిలో హత్యకు గురయ్యారు.ఎమర్జెన్సీ వంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ఫలితంగా మేధావుల నుంచి , విపక్షాల నుంచి తీవ్ర విమర్శలనెదుర్కొన్నారు. 1977 ఎన్నికల్లో ఆమె నేతృత్వం లోని కాంగ్రెస్ ఓడిపోయి.. దేశంలో మొట్టమొదటిసారి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలోని జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన తొలి కాంగ్రెసేతర పార్టీకి చెందిన ప్రధాని అయ్యారు.
నాటకీయ పరిణామాల నేపథ్యంలో గద్దె దిగిన మొరార్జీ దేశాయ్
1979 లోమొరార్జీ దేశాయ్ అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేశాక 1980 వరకు చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. కానీ నాడు అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరిగి ఇందిరాగాంధీ విజయం సాధించి ప్రధాని అయ్యారు. గార్డుల చేతిలో హత్యకు ఆమె గురైన అనంతరం అదే సంవత్సరంలో రాజీవ్ గాంధీ అధికార పగ్గాలను చేబట్టారు.
13 రోజుల వాజ్ పేయి ప్రభుత్వం
అయిదేళ్ల తరువాత జనతాదళ్ కు చెందిన వి.పి. సింగ్ 1989 లో నేషనల్ ఫ్రంట్ పేరిట సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఆ తరువాత చంద్రశేఖర్ , అనంతరం 1991 లో పీవీ నరసింహారావు దేశ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. 1996 లో బీజేపీ నేతృత్వంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య నాడు 13 రోజులు మాత్రం అధికారంలో ఉంది. హెచ్. డి. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్ అనంతరం వాజ్ పేయి 1998-99 లో తిరిగి ప్రధాని కావడం విశేషం. ఇక 2004 నుంచి 2009 వరకు యూపీఎ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి..మోడీ ప్రధాని అయ్యారు. 2019 లోనూ ఆయన హవా కొనసాగింది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి తిరిగి మూడో సారి అధికార పగ్గాలు చేబట్టగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.