కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో కాజ్వేలు లంక గ్రామాలు నీటమునిగియాయి. ముక్తేశ్వరం ఎదురు బిడియం కాజ్వే వద్ద ఉన్న స్మశాన వాటిక వరద నీటిలో మునిగిపోవడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులకు దహనకాండలు చేసేందుకు చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గోదారి ఉగ్రరూపం
గోదారి ఉగ్రరూపం దాల్చింది.. లంక వాసులను హడలెత్తిస్తోంది.. ప్రధాన నదీపాయలతో పాటు లంక గ్రామాల్లోని చిన్న పాయల్లో సైతం నీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. రోడ్లు.. కాజ్‌వేలను ముంచెత్తిన వరద ఇళ్ల చుట్టూ చేరింది. గోదావరి మధ్య ఉన్న లంక గ్రామాలతో పాటు ఏటిగట్లను ఆనుకుని ఉన్న లంకల్లో సైతం వరద నీరు చేరడంతో స్థానికులు రాకపోకలకు పడవలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు వరద సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ముంపు ప్రాంత వాసులను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రైతులు ఆందోళన
కోనసీమ జిల్లాలోని లంకల్లో శనివారం (జూలై 29) రెండు అడుగుల మేర వరద ఉధృతి పెరిగింది. లంక గ్రామాల్లో ఆదివారం మరింత పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద వరద పెరుగుతుండడంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. లంక గ్రామాల్లో పండే అరటి, కంద, పసుపు, కూరగాయల పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదతో సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డెల్టాలో మురుగునీటి కాలువల ద్వారా ముంపు నీరు గోదావరి నదీపాయలలోకి దిగే అవకాశం లేకుండా పోయింది.
వరద ముంపు లోనే
రాజోలు దీవిలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇంకా వరద ముంపులోనే సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లో పలు గ్రామాలు ఉన్నాయి. పాశర్లపూడి-అప్పనపల్లి కాజ్వే మునిగి పోవటంతో అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సఖినేటిపల్లి లంక-అప్పన్నరాముని లంక కాజ్వే నాలుగు గ్రామాలకు ఇంకా వరద నీటిలోనే ఉండటంతో రాకపోకలు నిలిచాయి. గత పది రోజులుగా వరద ముంపు లోనే చాకలిపాలెం - కనకాయలంక కాజ్వే కొట్టుమిట్టాడుతుంది. నాటు పడవలపైనే అవస్థలు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు ఇరు జిల్లాల ప్రజలు. అప్రమత్తమైన SDRF బృందాలు, లోకల్ పోలీస్, వరదమంపు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు.