LokSabha Elections 2024: దేశవ్యాప్తంగా నేడు 21 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే అన్ని ప్రాంతాల్లో సవ్యంగానే ఓటింగ్ జరుగుతుండగా మణిపూర్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. థమన్‌పోక్పిలోని పోలింగ్ బూత్ వద్ద కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఓటర్లు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు..
ఈ మేరకు తొలి దశ ఎన్నికల్లో మణిపూర్‌లోని 2 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీగానే తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మొయిరాంగ్ సెగ్మెంట్‌లోని థమన్‌పోక్పిలో గల పోలింగ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకుల కాల్పులకు పాల్పడటం కలకలం రేపింది. కొందరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపగా.. స్థానికులు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పోలింగ్ బూత్ నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులకు పాల్పడిన వారికోసం సమీపంలో గాలిస్తున్నారు.