Jagan Letter to Modi: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మోదీకి సంచలన లేఖ రాశారు. నెల రోజులుగా ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ ఆయన ఫిర్యాదు చేశారు. 30 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారని.. 300 మందిపై హత్యాప్రయత్నాలు జరిగాయని.. ఆ లేఖలో జగన్ వివరించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఇప్పటికే 35 మంది ఆత్మహత్య చేసుకున్నారనీ.. అరాచకాలు భరించలేక 2700 కుటుంబాలు ఊళ్లు విడిచి వెళ్లిపోయాయనీ చెప్పారు.
అంతేకాకుండా, వైసీపీ నేతల ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వినుకొండలో నడిరోడ్డుపై నరమేధం సృష్టించారనీ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై (MP Midhun Reddy) టీడీపీ నేతలు దాడి చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 45 రోజుల ఘటనలపై కేంద్ర సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేసిన జగన్.. ఈ దురాగతాలను నివేదించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ప్రధానిని కోరారు.
వినుకొండకు జగన్..
Jagan Letter to Modi: ఈరోజు వినుకొండకు (Vinukonda) వైసీపీ అధినేత జగన్ వెళ్లనున్నారు. వినుకొండలో దారుణహత్యకు గురైన రషీద్ కుటుంబాన్నీ ఆయన పరామర్శిస్తారు. వినుకొండ చెక్‌పోస్టు సెంటర్ లో దారుణం నడిరోడ్డు పై అందరూ చూస్తుండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వైసీపీ నేతను కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో రషీద్ రెండు చేతులు తెగిపోయాయి. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి రషీద్ మద్యం షాపులో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. కాగా, ఇది టీడీపీ చేసిన హత్యగా వైసీపీ ఆరోపిస్తోంది. షేక్ జిలానీ కొన్నిరోజుల క్రితం అంటే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాడు. అంతకు ముందు జిలానీ, రషీద్ ఇద్దరూ వైసీపీలో ఉండేవారని.. అప్పట్లోనే ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయని పోలీసులు చెప్పారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న జిలానీ.. అధికార పార్టీలో ఉన్నాననే తెగింపుతోనే ఈ హత్యకు పాల్పడ్డాడనీ, దీనికి టీడీపీ నేతలు వత్తాసు పలికారని వైసీపీ ఆరోపిస్తోంది. కాగా, ఇప్పుడు రషీద్ కుటుంబ సభ్యులను పరామర్సించడానికి జగన్ వస్తుండడంతో వినుకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.