గజరాణి వయస్సు నిర్థారణకు సిద్ధం..
మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో 'వత్సల' అనే ఆడ ఏనుగు నివాసముంటోంది. పురాతన కాలం నుంచి జీవిస్తున్న ఆ ఏనుగు వయసును నిర్థారించడానికి ల్యాబ్ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పరీక్ష అనంతరం ఆ టెస్టు ఫలితాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపనున్నారు. ఈ పరీక్షలో దాని వయసు కచ్చితంగా తేలితే గిన్నిస్ వరల్డ్ రికార్డు చోటు దక్కించుకునే అవకాశముంది. అయితే ఈ రికార్డు చేపట్టాలంటే దాని వయసు 103 సంవత్సరాల పైనే ఉండాలి.
మన హైదరాబాద్‌లోనే ల్యాబ్ పరీక్ష..
'వత్సల' గజరాణి వయసును నిర్థారించడానికి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి దాని దంత నమూనా పంపిస్తామని పన్నా టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బజేంద్ర ఝా తెలిపారు. 1971లో కేరళ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ ప్రాంతానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఏనుగు వయస్సు 50 సంవత్సరాలుగా ఉండేదన్నారు. అక్కడి నుంచి 1993లో పన్నా టైగర్ రిజర్వ్‌కు వచ్చిందని చెప్పారు. దీనిని బట్టి చూస్తే మధ్యప్రదేశ్‌లో 52 సంవత్సరాలు జీవించిందని.. ఇక్కడికి వచ్చే సమయానికి దాని వయస్సు 50 సంవత్సరాలు కాబట్టి.. రెండింటిని కలిపితే దాదాపు 102 సంవత్సరాలు ఉంటుందని బజేంద్ర వెల్లడించారు.
ఏనుగుల సగటు వయస్సు 60 నుంచి 70 సంవత్సరాలు..
సాధారణంగా ఏనుగుల సగటు వయస్సు 60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. వత్సల అనే పేరుకు 'ఆప్యాయత' అని అర్థం వస్తుందని.. పన్నా టైగర్ రిజర్వ్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఆడ ఏనుగును ఎంతో ఇష్టపడతారని ఆయన వివరించారు. 'వత్సల' వయస్సు నిర్థారణ అయి గిన్నిస్ బుక్ ప్రతినిధులు దానిని అత్యంత పురాతన ఏనుగుగా గుర్తిస్తే మాత్రం ప్రపంచంలోనే భూమిపై అత్యధికాలం జీవించిన ఏనుగుగా వరల్డ్ రికార్డు సృష్టించినుంది. ఇది భారతీయులకు చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. గతంలోనూ ఈ ఏనుగు వయసుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ప్రస్తుతం దేశంలో 28 వేల ఏనుగులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 25 శాతం ఏనుగులు కర్ణాటక అడవుల్లోనే ఉన్నాయి. ప్రపంచంలో అసియా ఏనుగులు.. ఆఫ్రికా ఏనుగులు అనే రెండు రకాలు ఉంటాయి.