హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వదిలిపెట్టడం లేదు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. కేవలం అరగంటలో 3.65 సెం.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయ్యింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షానికి నగరం తడిసి ముద్దైంది.
విరామం ఇవ్వకుండా కురుస్తున్న వర్షానికి శేరిలింగంపల్లి లోని ఓ నిర్మాణ సంస్థ సెల్లార్ రిటర్నింగ్ వాల్ కూలిపోయింది.లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ సెల్లార్లలోకి మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి.
బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, బంజారాహిల్స్ లో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మూసారాంబాగ్ వంతెన పై భారీగా వర్షం నీరు నిలవడంతో అంబర్ పేట్ నుంచి దిల్‌సుఖ్ నగర్ కు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రదేశాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వాన పడటం వల్ల ప్రజలు భయానికి లోనయ్యారు.