నిలిచిపోయిన రాకపోకలు
నైరుతి రుతుపవనాలతో ఉత్తరాఖండ్ వ్యాప్తంగా భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా 17 రోడ్లు, 9 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. నేడు కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇవాళ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అయితే భారీ వర్షాలతో అలకనంద నదిపై ఉన్న gvkహైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ నిండటంతో దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి నీరు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. హరిద్వార్‌లో గంగానది వార్నింగ్ స్థాయి అయిన 293 మీటర్లను దాటి ప్రమాదకరంగా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఎక్కువగా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే శిబిరాలకు తరలించారు. భగవాన్‌పుర్, లస్కర్, హరిద్వార్, రూర్కీ, ఖాన్‌పుర్ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు భారీగా చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా తాగటానికి నీరు.. ఆహారం, బట్టలు లేక చాలా మంది గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఉప్పొంగుతున్న యమునా
అంతేకాకుండా ఢీల్లీలోనూ యమునా నది వరద నీటితో మళ్లీ ఉప్పొంగుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరటంతో నీటిమట్టం ఇంకా ప్రమాదకర స్థాయిపైనే ఉంది. అయితే నేడు కూడా నది నీటిమట్టం 205.50 మీటర్లుగా ఉండగా.. అది గంటగంటకు పెరిగుతుందని అధికాలు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహంతో పాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉండటంతో నీటిమట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాత ఢిల్లీ యమునా వంతెనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు, ఢిల్లీలో వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఎర్రకోట, రాజ్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే ఉండటంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కీలక సూచనలు
ఉత్తరాదిన కురుస్తున్న భీకర వర్షాలు దేశ రాజధానిని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై మనిషి లోతు నీరు ప్రవహిస్తోంది. భవనాల్లోని కింది అంతస్థులు మొత్తం నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. పరిస్థితులపై సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వాసులకు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. యమునా నది ఉద్ధృతితో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. అక్కడక్కడా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.