హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోలన్‌లోని బద్ది నలగర్ పారిశ్రామిక ప్రాంతంలో వంతెన మొత్తం కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు 14మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల ధాటికి ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. వరదల కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
ఐఎండీ రెడ్ అలర్ట్:
IMD ఢిల్లీ శాస్త్రవేత్త సోమా సేన్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించాము. రేపటి నుండి హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం తగ్గే అవకాశం ఉంది. అయితే ఉత్తరాఖండ్‌లో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు తూర్పు పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, దక్షిణ రాజస్థాన్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ క్రమంలో సీఎం సుఖిందర్ సింగ్ సుఖు రాబోయే 24గంటలు ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ వీడియో సందేశం ఇచ్చారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల నేపథ్యంలో 1100, 1070, 1077 హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేవారు. మండి జిల్లాలోని పండోహ్ దగ్గర భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండంతో ముంపునకు గురైన ఇళ్ల నుంచి 6గురిని భద్రతా సిబ్బంది రక్షించారు. కాగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు గత 50ఏండ్ల రికార్డును బ్రేక్ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో రాష్ట్ర ప్రజలందరూ 24గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని..అత్యవసరమైతే 1100, 1070, 1077 ఈ మూడు హెల్ప్ లైన్లకు ఫోన్ చేయాలని సీఎం తెలిపారు. మీకు సహాయం చేసేందుకు నేను 24గంటలు అందుబాటులో ఉంటాను అంటూ సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గాల్లోనే మకాం వేసి పరిస్థితిని అంచనా వేయాలని కోరారు. ఈ విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవాలని...వారి నష్టాన్ని భర్తీ చేయాలన్నారు.
కాగా భారీ వర్షాల కారణంగా భాక్రా నంగల్ డ్యామ్ దగ్గర నీటి ప్రవాహం భారీగా పెరిగిపోయింది. మండి జిల్లాలో బియాస్ నదిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హైవే పై వాహనాలు నిలిచిపోయాయి. మండీ కులు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడుతోంది. భారీ వరదల కారణంగా కసోల్ వెంబడి ప్రవహించే గ్రహణ్ కాలువలో ఆకస్మాత్తుగా నీరు పెరగడంతో కసోల్ మార్కెట్ వెంబడి పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.