Shortage of beers: తెలంగాణలో మద్యం ప్రియులకు ఎండాకాలం వేళ ఊహించని షాక్ తగలనుంది. మండే ఎండల్లో కూల్ బీర్ తో చిల్ అవుదామనుకునే వారి ఆశలు అడియాశాలు కానున్నాయి. గత పదిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల వైన్స్, బార్ ల్లో బీర్ నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తుండటం బీర్ ప్రియులను కలవరపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల అల్మారాల్లో బీర్ కనిపించడం లేదు.
రూ.1,000 కోట్ల బకాయిలు..
అయితే బీర్ల కొరతకు బలమైన కారణమే ఉంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఆలస్యం కావడంతో చాలా మద్యం కంపెనీలు బీర్ల సరఫరాలను తగ్గించేశాయి. మద్యం తయారీ కంపెనీలు, బ్రూవరీలు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.1,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ఇటీవల రూ.100 కోట్లు మాత్రమే చెల్లించిందని, అది కూడా రెండు కంపెనీలకు మాత్రమే చెల్లించడంతో చాలా కంపెనీలు మద్యం పంపేందుకు ముందుకు రావట్లేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP : టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ.. ఆశావాహుల్లో మొదలైన టెన్షన్!
అలాగే గత కొన్ని నెలలుగా బీర్ తయారీదారులు పాత బకాయిలను క్లియర్ చేయాలని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు అనేక విజ్ఞప్తులు చేసినట్లు సమాచారం. కాగా 'చాలా చిన్న, మధ్యస్థ కంపెనీలు నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా క్రమంగా సరఫరా తగ్గించాయి' అని కంపెనీ యజమానులు వాపోతున్నారు. నిజానికి సమ్మర్ లోనే అత్యధికంగా అమ్ముడే పోయే బీర్ల సరాఫర ఆగిపోవడంపై వైన్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్ల అమ్మకాలు తగ్గితే తమ ఆదాయానికి గండి పడుతుందని కలవరపడుతున్నారు.