AP: అటవీశాఖ అధికారులు సీజ్ చేసిన విలువైన కార్లు మాయం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆరాతీస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బీఎం డబ్ల్యూ కార్లు ఎక్కడా అంటూ ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులను నిలదీశారు. 2017లో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడ్డ కేసులో స్మగ్లర్ కు చెందిన బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకొని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయిస్తూ అప్పటి పీసీసీఎఫ్ ఉత్తర్వులు ఇచ్చింది.
బీఎండబ్ల్యూ కారు మాయం..
అయితే ప్రస్తుతం ఆ కారు కనిపించకపోవడంపై పవన్ అటవీశాఖ అధికారులను ప్రశ్నించారు. నాటి నుంచి 2019 వరకూ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి పోస్టులోనే కొనసాగిన అనంతరామ్ ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు మాయం కావడంపై వివరణ కోరారు. 2019 జూన్ నుంచి 2020 అక్టోబర్, 2022 పిబ్రవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు తమిళనాడుకు చెందిన టీఎన్ 07 సీబీ 3724 టయోట ఇన్నోవా కారును కేటాయించారు.
స్మగ్లర్లకు అందించారా..
2015లో పుత్తూరు అటవీ రైంజ్ పరిధిలో ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ 18కే 2277 నెంబర్ గల బీఎండబ్ల్యూ బ్లూ కలర్ కారును అటవీ శాఖ మంత్రి అదనపు ప్రయివేట్ కార్యదర్శికి కేటాయించారు. అప్పట్లో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, మంత్రి అదనపు ప్రయివేట్ కార్యదర్శి ఉపయోగించిన ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మాయమయ్యాయి. అయితే వాటిని కుటుంబ సభ్యులు ఉపయోగించుకుంటున్నారా లేక స్మగ్లర్లకు అందించారా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. వీటిపై పీసీసీఎఫ్ ను నివేదిక ఇవ్వాలని పవన్ కోరడం చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే!
ఇక 2015లో పేరు మోసిన స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అరెస్ట్ విషయంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పట్లో నెల రోజుల పాటు వలపన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన బడా స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ ను హెడ్ కానిస్టేబుల్ పట్టించాడు. భారీ స్థాయిలో నగదు స్వాధీనం చేసుకొని తక్కువ మొత్తం చూపించిన ఓ ఐపీఎస్ అధికారి.. ఫయాజ్ ను అరెస్ట్ చేసి అతని అనుచరులను వదిలిపెట్టడం దుమారం రేపింది. ఈ కేసు వ్యవహారంలో ఫయాజ్ తో ఓ ఐపీఎస్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కాగా భారీ మొత్తంలో వసూళ్లు చేసుకొని అనుచరులను వదిలిపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఫయాజ్ అరెస్ట్ కావడం జీర్ణించుకోలేక హెడ్ కానిస్టేబుల్ లను బలి చేసిన ఆ ఐపీఎస్ అధికారికి ఫయాజ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి.
ఇది కూడా చదవండి: Adani: అదానీకి ఊహించని షాక్.. రూ.16 కోట్ల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష!