ఆర్థిక మాంద్యం దెబ్బకి ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి దాపరించింది. నష్టాలు రాకుండా.. వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను పీకిపడేస్తున్నాయి. వాళ్లకేం పోయింది.. తమ కంపెనీ బాగుంటే చాలు..ఎవరు ఎటు పోయారన్నది వాళ్లకి అనవసరం. దిగ్గజ కంపెనీలైనా..చిన్నచితక కంపెనీలైనా అదే తీరు. 'జాబ్ లేఆఫ్' అన్నది బిజినెస్‌ని కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందన్న మాట నిజమేనైనా.. ఎన్నో ఆశలతో, పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ వచ్చిందన్న ముచ్చట మూడునాళ్లైనా తీరకముందే ఉద్యోగం ఊడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా చాలా దిగ్గజ కంపెనీలు లే ఆఫ్‌లను కంటిన్యూ చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ మరోసారి తమ కంపెనీ ఉద్యోగులను ఇంటికి పంపించింది.
ఇలానే కొనసాగితే కష్టమే:
ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల్లో కోత పెట్టింది. ఈసారి కంపెనీ కన్ను ఫార్మసీ విభాగంపై పడింది. అమెజాన్ ఫార్మసీ బిజినెస్ యూనిట్‌లోని కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్యపై అమెజాన్ ఇప్పటివరకు ఓ క్లారిటీ ఇవ్వలేదు. అయితే 'సెమాఫోర్' నివేదిక ప్రకారం తాజా రౌండ్ తొలగింపుల సమయంలో టెక్ దిగ్గజం 80 మంది ఉద్యోగులను తీసివేసిందని పేర్కొంది. ప్రభావిత వ్యక్తులలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్లు, టీమ్ లీడ్స్ ఉన్నారని చెప్పింది. ఇప్పటికే రిజిస్టరైన ఫార్మసిస్ట్‌లు తొలగించలేదు. తమ బిజినెస్ గ్రోత్ కోసమే ఈ పని చేసినట్టు అమెజాన్ 'CNBC'కి తెలిపింది. క్వాలిటి అండ్ ఎఫిషియన్సి కోసమే ఉద్యోగులను సాగనంపామని చెప్పింది. ఇది కస్టమర్ సర్వీస్‌ని మరింత పెంచుతుందని అభిప్రాయపడింది. మరోవైపు ఉద్వాసనకు గురైన ఉద్యోగులు మాత్రం కంపెనీ వ్యాఖ్యలతో అంగీకరించలేదు. స్టాఫ్ తగ్గితే కస్టమర్ సర్వీస్ ఎలా పెరుగుతుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా ఉద్యోగం నుంచి తీసేసింది చాలదన్నట్టు కంపెనీ లాభాల కోసమే చేశామని నేరుగా చెబుతున్నారంటూ మండిపడుతున్నారు.
మరిన్ని ఉద్యోగాలు ఫసక్?
అమెజాన్ ఉద్యోగులను రీమూవ్ చేయడం ఇదేం తొలిసారి కాదు. ఆర్థిక మాంద్యం భయంతో ఇప్పటికే సుమారు 27వేలకు పైగా ఉద్యోగులను వదిలించుకున్న అమెజాన్.. ఈ లేఆఫ్‌లను ఇప్పడప్పుడే ఆపేలా కనిపించడలేదు. ముందుగా 18వేల మంది ఉద్యోగాల కోతలు జరగగా..తర్వాత అదనంగా 9వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఇక గత మేలో, అమెజాన్ దేశంలోని వివిధ వ్యాపార రంగాలు, విధుల్లోని 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందించారు. ఇప్పుడు ఫార్మా ఉద్యోగులను సైతం తీసివేశారు. ఇక ముందుముందు మరిన్ని కోతలు తప్పవన్న సంకేతాలు కూడా ఇచ్చారు. ఒకప్పుడు అమెజాన్‌లో జాబ్ అంటే హై సెక్యూరిటీగా ఫీల్ అయ్యిన ఉద్యోగులు ఇప్పుడు ఈ కంపెనీలో జాబ్ అంటేనే భయపడుతున్నారు. కొత్తగా జాయిన్ అయ్యేవారిపై కూడా ఈ ప్రభావం ఉంటుందంటున్నారు మార్కెట్ నిపుణులు. అనుభవం ఉన్నవాళ్లు అమెజాన్‌లో చేరేందుకు ఆసక్తి చూపించరని.. కేవలం ఫ్రెషర్లనే కంపెనీ రిక్రూట్ చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెజాన్ దారిలోనే మిగిలిన టెక్ కంపెనీలు కూడా నడుస్తుండడం టెక్కిలను మరింత కలవర పెడుతోంది.