'ఇండియా' అంటే ఎన్డీయే గుండెల్లో గుబులు.. సీఓటర్ సర్వేలో తేలిన నిజాలు

ప్రతిపక్షాల కూటమి ' ఇండియా' .. బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకి షాకివ్వనుందా ? కాంగ్రెస్ ఆధ్వర్యం లోని 26 విపక్షాలతో కూడిన ఈ 'గ్రాండ్ అలయెన్స్' 2024 లోక్ సభ ఎన్నికల్లో కమలనాథులను 'ఇబ్బంది' పెట్టనుందా ? ప్రధాని మోడీ ప్రభుత్వానికి పెను సవాలుగా మారనుందా ? ఏబీపీ సి-ఓటర్ సర్వేలో తేలిన ఫలితాలు కాస్త అటూ ఇటూగా అవుననే అంటున్నాయి.

'ఇండియా' అంటే ఎన్డీయే గుండెల్లో గుబులు.. సీఓటర్ సర్వేలో తేలిన నిజాలు
New Update

india alliance

జులై 18 న బెంగళూరులో జరిగిన విపక్షాల రెండో సమావేశంలో 'ఇండియా' అన్న పేరును తమ కూటమికి నేతలు ప్రకటించారు. ఏ ముహూర్తాన ఈ పేరును ప్రకటించారోగానీ సర్వేలో చాలామంది ఈ కూటమిని ఎదుర్కోవడం బీజేపీకి కష్ట సాధ్యమనే అభిప్రాయపడ్డారు. 48 శాతం మంది ఈ పేరుతో బీజేపీని ఎదుర్కోవడం మామూలుగా ఉండదని అంటే 34 శాతం మంది అలాంటిదేమీ జరగదని, బీజేపీ విజయానికి ఢోకా ఏమీ లేదని చెప్పారు. 18 శాతం మంది అయోమయానికి గురవుతూ తమకేమీ తెలియదని ముఖం చాటేసినంత పని చేశారు. ఇలా ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పేరును నిర్ణయించడంలో కాంగ్రెస్ తనదే పై చేయి అని నిరూపించుకుందా.. దీన్ని 'హైజాక్' చేసిందా అన్న ప్రశ్నకు 37 శాతంమంది అవుననగా.. అలా తాము భావించడం లేదని 35 శాతం మంది చెప్పారు. 28 శాతం మంది తమకు తెలియదన్నారు.

ఇండియా సి-ఓటర్ సర్వేలో భాగంగా 2 వేల 664 మంది నుంచి అభిప్రాయాలను రెండు రోజులపాటు సేకరించారు. ఇక ఈ 'ఇండియా' కు కన్వీనర్ గా ఎవరుంటారన్న ప్రశ్నకు కొందరు రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తే.. మరికొందరు నితీష్ కుమార్ అని, మరి కొంతమంది అరవింద్ కేజ్రీవాల్ అని, ఇంకొంతమంది మమతా బెనర్జీ అంటే.. 'ఒకరిద్దరు' శరద్ పవార్ అని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 31 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటేయగా.. నితీష్ కి 12 శాతం మంది, కేజ్రీవాల్ కి 10 శాతం మంది, మమతకు 8 శాతం, శరద్ పవార్ కు 6 శాతం మంది జై కొట్టారు. 33 శాతం మంది అయితే ఏమీ చెప్పలేమన్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం విపక్షాలకు సాదాసీదా అయ్యే పని కాదు. అందువల్లే దీనిపై చర్చించడానికి ముంబైలో మళ్ళీ సమావేశమవుదామని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రకటించారు. సోనియా గాంధీ, రాహుల్, నితీష్, శరద్ పవార్, మమత వంటివారున్నా ఎవరి లోటుపాట్లు వారికి ఉన్నాయి. తన లోక్ సభ సభ్యత్వం రద్దుతో రాహుల్.. కోర్టుల చుట్టూతిరుగుతున్నారు. మమతా బెనర్జీకి 'నేషన్ వైడ్ అప్పీల్' లేదు.. ఎన్సీపీలో చీలికతో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ చిక్కులనెదుర్కొంటున్నారు. నితీష్ కుమార్ కి లోగడ బీజేపీతో సంబంధాలున్నా.. ఆ పార్టీకి తరువాత టాటా చెప్పేశారు. పైగా ఈ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఉద్దేశం లేదని చెప్పేశారు. ఎన్సీపీ గానీ, తృణమూల్ కాంగ్రెస్ గానీ, జేడీ-యు గానీ కూటమిని ముందుకు తీసుకువెళ్ళలేవన్న అభిప్రాయాలున్నాయి. తమకు అధికారం మీదా, ప్రధాని పదవి మీదా వ్యామోహం లేదని మల్లిఖార్జున్ ఖర్గే ప్రకటించారు. మరి ఆ మాత్రం దానికి ఇంత 'హడావుడి (బిల్డప్) ఎందుకన్న గుసగుసలు వినబడుతున్నాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి