అత్తారింట్లో కూతురు పడుతున్న బాధలు చూడలేని ఓ తండ్రి..తన కూతురిని ఆ ఇంటి నుంచి విముక్తురాలిని చేయడమే కాకుండా..మేళతాళాలతో పుట్టింటికి తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా కూతురికి వివాహం చేసిన తరువాత అత్తారింటికి బ్యాండ్ బజాలతో పంపిస్తారు.కానీ ఇక్కడ ఓ తండ్రి దానికి భిన్నంగా తన కుమార్తెకు మెట్టినింటి నరకం నుంచి విడిపించి తన ఇంటికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన జార్ఖండ్ లోని రాంచీలో చోటు చేసుకుంది. ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి తన కుమార్తె సాక్షి గుప్తాను రాంచీలోని సచిన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి జరిగిన తరువాత రోజు నుంచే సాక్షికి అత్తింటి వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ విషయం గురించి సాక్షి తన తల్లిదండ్రులకు తెలిపింది.
Also read: దీపావళికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. సీఎం అదిరిపోయే శుభవార్త!
అయితే అందరి తల్లిదండ్రులు లాగానే సాక్షికి కూడా వారు నచ్చజెప్పారు. సర్దుకుపోవాలని సూచించారు. దాంతో సాక్షి కూడా తల్లిదండ్రుల మాట కాదనలేక కాపురానికి ఒప్పుకుంది. ఈ విషయం తెలుసుకున్న సచిన్ భార్యను ఇంకా ఎక్కువ వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన సాక్షి మరోసారి తన తండ్రికి విషయం గురించి తెలిపి భోరున విలపించింది. అంతేకాకుండా సచిన్ కి ఇంతకు ముందే వివాహం జరిగినట్లు తెలిపింది.
దీంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అత్తారింట్లో పడుతున్న బాధలు చూడలేని తండ్రి ప్రేమ్ గుప్తా..సచిన్ ఇంటికి బంధుమిత్రులతో కలిసి వెళ్లి సాక్షి ని బయటకు తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి పుట్టింటి వరకు మేళతాళాలతో కూతురిని అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ తీసుకుని వచ్చారు.
సాక్షి తండ్రి చేసిన పనిని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా స్వాగతించారు. ఈ క్రమంలోనే విడాకులు కోసం వారు కోర్టును ఆశ్రయించారు. కన్నవారిని , పుట్టిన ఇంటిని , బంధుమిత్రులను అందర్ని వదులుకుని భర్తే సర్వస్వం అనుకొని వెళ్లిన ఆడపిల్లని ఇలా హింస పెడితే ఎలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఏ తల్లిదండ్రులైనా సరే గౌరవ మర్యాదలకు భయపడి కన్న బిడ్డలను దూరం చేసుకోకూడదని ఆయన సూచించారు. ఈ పని చేసిన ప్రేమ్ గుప్తా ఎంతో మందికి ఆదర్శం అవుతారు.