అసలే కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలు, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ పై మరో దెబ్బపడింది. కేవలం రెండు రోజుల్లో మయన్మార్ నుంచి 700 మందికి పైగా ఆ దేశవాసులు అక్రమంగా ఈ రాష్ట్రంలో ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ నెల 22.. 23 తేదీల్లో 718 మంది మయన్మార్ వాసులు సరైన ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా ఇండియాలోకి.. ముఖ్యంగా తమ రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారో తెలపాలంటూ మణిపూర్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి వివరణాత్మక రిపోర్టును కోరింది.
ఆ దేశ వాసులను తమ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తాము ఇదివరకే కోరామని మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషీ నిన్న అస్సాం రైఫిల్స్ కి సమాచారం పంపారు. ఎలాంటి వీసా లేదా ట్రావెల్ డాక్యుమెంట్లు లేకుండా మణిపూర్ లోకి మయన్మార్ వాసులు ప్రవేశించరాదని భారత హోమ్ మంత్రిత్వ శాఖ కూడా గతంలోనే ఆదేశాలు జారీ చేసిందన్నారు. మయన్మార్ లోని ఖాంపాట్ లో ఈ నెల 23 న పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో ఇండో-మయన్మార్ సరిహద్దులు దాటి చందేల్ జిల్లా ద్వారా ఆ దేశ శరణార్థులు మణిపూర్ లోకి ప్రవేశించారని ఇంతకు ముందే అస్సాం రైఫిల్స్ కి అధికారులు తెలియజేశారు
వీరిని వెనక్కి తిప్పి పంపివేయాలని కోరారు. వీరి కదలికలపై నిఘా వేయాలని, బయోమెట్రిక్ ద్వారా వీరందరి ఫోటోలు తీసుకోవాలని చందేలీ జిల్లా పోలీసు అధికారులకు సలహా ఇచ్చారు. మణిపూర్ లో మే 4 న ఇద్దరు మహిళలను దుండగులు నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి వైరల్ అయిన వీడియోతో ఇప్పటికే మణిపూర్ పలు వివాదాలనెదుర్కొంటోంది. ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
పులిమీద పుట్రలా మయన్మార్ లో సాయుధ దుండగులు ఓ మహిళను హతమారుస్తున్న ఘటనను మణిపూర్ లోనే జరిగినట్టు ఉన్న ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఇది ఫేక్ వీడియో అని మణిపూర్ పోలీసులు ప్రజలకు చెప్పేసరికి ప్రాణాలు పోయినంత పనయింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఉదంతంపై వారు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. వీటిని నమ్మవద్దని కోరారు. ఈ సంఘటన మయన్మార్ లో జరిగిందని, మన రాష్ట్రంలో కాదని వారు ఓ ప్రకటన విడుదల చేయాల్సివచ్చింది.